ప్రభుత్వ ఆదర్శ జూనియర్ కళాశాల మెనూర్ లో మంగళవారం రోజున విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీస్ శాఖకు చెందిన ఎస్‌ఐ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కీలక సూచనలు అందించారు.
ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల గురించి విద్యార్థులకు వివరిస్తూ, మొబైల్ ఫోన్ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్యుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, OTPలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహాలు పెంచుకోవడం వల్ల జరిగే ప్రమాదాలపై కూడా వివరించారు.
రోడ్డు భద్రత అంశంపై మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం అత్యంత అవసరమని తెలిపారు. వేగంగా వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలను ఉదాహరణలతో వివరించారు.
పోలీస్ శాఖ పని తీరుపై అవగాహన కల్పిస్తూ, ఎలాంటి సమస్యలైనా ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు చట్టాలను గౌరవించే బాధ్యత గల పౌరులుగా ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ భద్రత, ట్రాఫిక్ నియమాలపై సందేహాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
